Tuesday, 23 June 2015

ఇల్లాలికి నా ప్రేమాలేఖ ...

ముక్డి....

ఓయ్ దొంగపిల్లా... ముక్డి  అనే పిలుపు చూడగానే ముసి ముసి నవ్వులతో మురిసిపోతున్నావు కదూ..?
నాకు తెలుసులే... మన స్నేహం తొలినాళ్లలో నీ పేరు పెట్టి పిలిచేందుకే మహా ఇబ్బంది పడిపోయిన నేను..
మనం ఒక్కటైనాక ప్రేమగా ముక్డి ముక్డి  అంటుంటే నీకెంత సంబరమో..
నీకు తెలీదుకానీ నాక్కూడా చాలా సంతోషంగా ఉంటుంది అలా పిలుస్తుంటే...

ఓయ్ తుంటరి పిల్లా... ఏం చేశావో నీకు తెలీదా... ?
ఏం చేశాను అని అలా బుంగమూతి పెట్టమాకు..నేనే చెబుతాలే.
అయినా సరే నీ మీద ఎంతగా ప్రేమ పెరిగిపోయిందో మాటల్లో చెప్పలేను.
నువ్వు ఏమైనా రాస్తే కేవలం ఆ మాటలు మాత్రమే ఆ లేఖలో ఉండేవి. కానీ ఏమీ రాయకుండా నువ్వు అలా వదిలేసి ఖాళీగా పంపిన లేఖలో నేను ఎన్నింటిని నింపుకున్నానో...
నువ్వే రాసినట్లుగా ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా మార్చి మార్చి చదువుకున్నానో.....
ఇదుగో ఆ లేఖ ఇప్పుడు నా చేతిలో అలాగే భద్రంగా..
అదేంటో ఆనాటి భావనే ఇప్పుడూ.. అక్షయపాత్ర లాంటి నీ ప్రేమని ఎంత ఆస్వాదించినా..
ఇంకా ఎంతో మిగిలే ఉందని అనిపిస్తుంటుంది..

నువ్ ఊరెళ్లగానే....... ఫోన్లు, మెసేజ్‌లు, ఈ మెయిళ్లు ఇవన్నీ ఇప్పట్లో రొటీనే కదా.. కాస్త వెరైటీగా మనం అందరం ఎప్పుడో మర్చిపోయిన లెటర్లో అందంగా అల్లిన అక్షరాల మాలల్ని పేర్చి నీకు బహుమతిగా అందిస్తే.... ఓహ్.. ఊహే భేషుగ్గా ఉంది.. దాన్ని నిజం చేద్దామని పెన్నూ, పేపర్‌తో సిద్ధమై..
మెల్లిగా సిరాని అక్షరాల్లో ఒలికిస్తూ మెుదలెట్టిన "నీ శ్రీవారి ప్రేమలేఖ"
ఇదుగో...

అయినా నీ దిగులంతా నాకు తెలుసులెండి శ్రీమతిగారు..
నేను ఒంటరిగా ఉంటానని,నా అవసరాలు ఎవరు చూస్తారని తమరి దిగులు.
అయినా నేను ఒంటరినని ఎవరన్నారు నీతో...?
నువ్వెప్పుడూ నా పక్కనే ఉంటుంటే నేను ఒంటరినెలా అవుతానే పిచ్చీ..
రోజూ బలవంతం చేసి, బుజ్జగించి మరీ తినిపించే నా బుజ్జమ్మ లేకపోయినా,
నువ్వే దగ్గరుండి అన్ని పనులూ చేస్తున్నట్లు ఫీల్ అవుతూ...
ఎంత చక్కగా పనులన్నీ చేసేసుకుంటున్నానో తెలుసా...?
నువ్వు చూస్తే.. ఎంతగా మెచ్చుకుంటావో...

నువ్వు గుర్తు వచ్చినప్పుడు నీ చీరని చుట్టుకుని పడుకుంటే.. అదేంటో చిత్రం.. అచ్చం నీ పక్కనే పడుకుని ఎంచక్కా కబుర్లు చెబుతున్నట్లు..
నేను చెప్పే కబుర్లను వింటూ మిలమిలా మెరుస్తూ, అటూ ఇటూ కదలాడే నీ మీనాల్లాంటి కళ్లని చూస్తున్నట్లు అనిపిస్తోంది..
ఎన్నెన్ని కబుర్లో.. చెప్పి, చెప్పీ ఎప్పుడో అలసిపోయి నిదురబోయిన నేను..
ఉదయాన్నే కళ్లు తెరిచి చూసేసరికి నీ ఒడిలో ( నీ చీరలో ముఖం దాచుకుని) హాయిగా బజ్జోనుంటాను. ఇంట్లో నువ్వున్నప్పుడు ఎలా కబుర్లు చెబుతుంటానో అలా కబుర్లు చెప్పుకుంటూనే పనులన్నీ చకచకా కానించి, ఆఫీసుకు పరుగులెడుతున్నాను. చూశావా.. ఎంత బుద్ధిమంతుడో నీ శ్రీవారు...
"అబ్బా చాల్లేద్దూ... మావారికి దిష్టి తగులుతుంది" అంటున్నావు కదా..

నాకు తెలుసు ముక్డి ,
ఇంత రాత్రి గడుస్తున్నా... నాకు ఇంకా ఇంకా రాయాలని అనిపిస్తోంది బుజ్జమ్మా. ఎన్ని జ్ఞాపకాలో, మరెన్ని అనుభూతులో కదా..
నేనేమీ ముక్డిని  కాను బ్లాంక్ లెటర్ పంపేందుకు..  అయ్యగారు మాంచి మూడ్‌లో ఉన్నారు.. ఎన్ని పేజీలైనా అలవోకగా ఇట్టే రాసేయగలరు.
ఈ లేఖ ఎవరైనా చదివితే ఎలా అని భయపడే ప్రేమికుడి స్టేజ్ దాటిపోయి అయ్యగారు శ్రీవారి స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి..
ఎవరికీ భయపడే పనేలేదు. నువ్వీ లేఖ చదువుకున్నా ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. మొగుడూ పెళ్లాలు వాళ్ల ఇష్టం అని మన పెద్దాళ్లు( మీ అన్న) ముసిముసిగా నవ్వుకుంటూ బయటపడతారు.

కానీ.. లేఖ ఇంతకంటే ఎక్కువ రాయాలంటే కష్టంగా ఉంది.
అదేంటి పెళ్లానికి ప్రేమలేఖ రాయటం కష్టమా... అందుకే
కూసింత స్వార్థంతో ఇప్పటికిలా లేఖను ముగించేస్తున్నాను.
బుంగమూతి బుజ్జమ్మా... అర్థం చేసుకుంటావుగా..
అయినా నువ్వు నా ముక్డివిగా .. ఎప్పుడో అర్థం చేసుకుని అప్పుడే పడుకునేశావా.. అమ్మో... ఎంతైనా ముక్డి , ముక్డమ్మె ....
లవ్ యూ ముక్డి .. హాయిగా బజ్జో తల్లీ....!

1 comment: