Tuesday, 16 June 2015

ఇదే నా మొదటి ప్రేమలేఖ..

ప్రియాతి ప్రియమైన శ్రీమతి ముక్డి కి,
నా చేత ప్రేమలేఖ వ్రాయించుకునే అదృష్టం నీదే మరి ఎందుకంటే..... ఇదే నా మొట్టమొదటి ప్రేమలేఖ

అలాగని నేను శ్రీ రామచంద్రుణ్ణి అని చెప్పలేను....
నా రేంజికి తగ్గట్టు ఏదో ఒకరో,ఇద్దరికి రాసి ఉంటా ..
ఇదిగో ఇలా అర్ధరాత్రి మూడింటికి నిద్రపట్టక ప్రేమలేఖ రాయాలనిపించే సీన్ ఐతే లేదు అమ్మడు ఎవ్వరికీ

ప్రేమలేఖ... అంటే ఏం రాయాలి...?
మనం ప్రేమికులం కాదు కదా...!!
పోనీ పెళ్ళికి ముందు తెగ ఫోన్లు చేసుకుని మాట్లాడుకున్న వాళ్ళమూ కాదాయె...!
కానీ ఏదో రాయాలని ఆరాటం.
నా రాతల్లో నిన్ను చూసుకోవాలని ఉబలాటం.
పోనీ కవితలు రాద్దామంటే....
మనకి కపిత్వం తెల్సుగాని... కవిత్వం తెలీదే...!
పాటలు రాద్దామంటే.... ఆ పాండిత్యమూ లేదు..!అందుకే....
నా మనసులో ఇప్పటికిపుడు నీగురించి వచ్చిన ఆలోచనలన్నీ అక్షరాల్లో పెట్టేస్తున్నా..! సరేనా...!

అదిసరేగాని, అసలు ఏం మాయచేసావ్ ముక్డి  నన్నూ..?
పోనీ నిన్ను చూసిన మొదటిసారే డుబుక్కున ప్రేమలో పడిపోయాను అంటే అదీ కాదు...

కానీ, మన నిశ్చితార్ధం రోజున నీ చేతి వేళ్ళు చూడగానే మాత్రం ముద్దొచేసాయంటే నమ్ము..!
మరీ ఎక్కువసార్లు చూశానేమో రెండుమూడు రోజులు కల్లో కూడా అవే వచ్చాయ్ [ ఎక్స్ట్రా ఫింగర్స్ ] ఆ చేతివేలికి ఉంగరం తొడిగే అదృష్టం నాదే అంటేనే అదొక గొప్ప ఫీలింగ్.... ఎవరెస్టు అధిరోహించేసినట్టు...!

నిశ్చితార్ధం చేసుకొని 15 రోజులకే .సౌదీ బయలుదేరితే.... నీ కళ్ళలో దిగులు చూస్తే.... ఎంత ఆనందమేసిందో తెల్సా...?
అవును మరి...! నాకోసం ఆలోచించే మనిషి ఒకరున్నారనే భరోసా
ఆ దిగులే...! నన్ను కావాలనుకునే వాళ్ళు ఉన్నారనడానికి సాక్ష్యం
ఆ దిగులే... అందుకే నాకు అది నచ్చింది.
కానీ ఆ దిగులు నాకూ అంటుకుని ఇదిగో ఇలా వేధిస్తోంది...!
నీతో గడిపిన ఆ రెండు రోజులు ఇవే నాకు ఇప్పుడు తిండి-నీళ్ళు-నిద్ర.... తెల్సా...??
ఎన్నిసార్లు నీ ఫోటో చూసినా... ఎంతసేపు నీతో ఫోన్లో మాట్లాడినా...వాట్స్అప్ లోచాట్ చేసినా... ఏదో వెలితి గుండెని మెలిపెట్టేస్తోంది. ...

నీకో సీక్రెట్ చెప్పనా...? అసలు పెళ్ళంటేనే నాకు చిరాకు. హాయిగా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నన్ను... మా అమ్మ 'అమ్మాయి బంగారంలా ఉంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఫోటో చూసి చెప్పరా!' అంటే.... ఇల్లదిరిపోయేలా అరిచా... 'అప్పుడే నాకు పెళ్ళేంటి?' అని. నీ ఫోటో చూపిస్తే చిరాగ్గా చూసి... 'మ్..సరే' అని ముక్తసరిగా సమాధానం చెప్పా! ఏదో ఒకటి పెళ్లి చేసుకుంటే ఈ టార్చర్ తప్పుతుందని. కానీ.... నిజ్జంగా నిజం.... మొదటిసారి నిన్ను చూసినప్పుడు మాత్రం.... మా అమ్మ టేస్ట్ మెచ్చుకోకుండా ఉండలేకపోయా...

కానీ.... నీకు అంత నమ్మకమేంటి నామీద...?
ఫోన్ లో నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని అడిగాను ఆ? ఎంత గడుగ్గాయివో!! ఎలాగైతేనేం.... బుట్టలో వేసేసుకున్నావ్ నన్ను!!

నీకేమి గిఫ్ట్ ఇవ్వలేదు నేను...అందుకే నీకోసం ఈ ప్రేమలేఖ వ్రాస్తున్నా! ఇదే నేను నీకివ్వబోయే మొదటి గిఫ్ట్
నాగురించి అన్ని రాసుకున్నావ్ కదా నువ్వు.... కానీ నీగురించి రాద్దామంటే..... నీ ఊహల్లో మునిగిపోవడమే తప్ప.... కాగితం మీద కలం కదిలితేనే కదా!
ఇదిగో... ఇన్నాళ్టికి అర్ధరాత్రి కుదిరింది ముహూర్తం
 ఎప్పుడో మర్చిపోయిన అక్షరాలన్నీ కూడబలుక్కుని రాస్తున్నా! నీ అంత అందంగా,కుదురుగా రాయడం కుదరట్లేదు... తిట్టుకోవు కదా!

నేను నిశ్చితార్ధంకి  ముందు.. ఇలాగే ఒంటరిగా ఉండేవాడిని. ఇప్పుడూ నా పరిస్థితిలో మార్పు లేదు. కానీ నా మనసులో మాత్రం బోలెడు మార్పు. చెప్పలేనంత మార్పు. ఆఫీసు-తిండి-నిద్ర తప్ప పట్టని నాకు.. ఊహలు నేర్పావు. కవితలు నేర్పావు. ప్రేమించడం నేర్పావు. విరహం అంటే ఏమిటో చూపిస్తున్నావు. ఇదిగో.... ఇలా ప్రేమలేఖ కూడా రాయించేస్తున్నావు!!
ఇన్ని ఇచ్చిన నా చెలి ... నా దగ్గరికి తొందరగా వచ్చెయవూ??వచ్చేస్తావు కదూ.... బంగారం!
నీకోసం ఎదురు చూస్తూ....
నీ శ్రీవారు...................మహి ....

No comments:

Post a Comment